అన్ని తెలుగు వార్తల సమాహారం

Vizag steel plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఏపీ ప్రభుత్వాన్ని ఇరికించిన కేంద్రం

 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఏపీ ప్రభుత్వాన్ని ఇరికించింది కేంద్రం. తాజాగా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర మౌలిక వసతులు సంస్థ ఏపీ ఇన్ క్యాప్ ను ఎంపిక చేశారు. దీంతో ఇకపై ఏ నిర్ణయం అయినా ఇన్ క్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది.


ఏపీ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దాదాపు 50 రోజులుగా కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ, ప్రజా సంఘాలు కార్మికులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏపీ బంద్, భారత్ బంద్ అంటూ పలు రకాల కార్యక్రమాలకు స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ సమితి పిలుపు ఇచ్చింది. రెండు కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. త్వరలోనే సమ్మెకు కూడా కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఇన్ని రకాలుగా నిరసనలు తెలిపినా కేంద్రం మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ప్రైవేటీకరణ విషయంలో ముందుకే వెళ్తోంది. వంద శాతం ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం పదే పదే ప్రకటిస్తోంది..

ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం అంతా కేంద్రానిదే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు, మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు అంతా ఆందోళనల్లో భాగమయ్యారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా 25 కిలోమీటర్ల పాద యాత్ర నిర్వహించారు. ఈ విషయంలో కేంద్రానిదే తప్పని.. తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది. కానీ విపక్షాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాతే కేంద్ర నిర్ణయాలు తీసుకుంటోందని. గతంలో పోస్కో ప్రతినిధులు సీఎం జగన్ ను కలిసి ఇదే అంశం చర్చించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలు ఎలా ఉన్నా.. వైసీపీ మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో తమకు ఏమాత్రం సంబంధం లేదని.. తప్పకుండా కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకుంటామని వైసీపీ నేతలు భరోసా కల్పిస్తున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించేదిశగా అడుగులు వేస్తోంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో నీతి ఆయోగ్ దూకుడు పెంచింది. నష్టాల్లో ఉన్న సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, ఆస్తుల ద్వారా నగదు సేకరణపై.. ఆయా రాష్టాలకు నీతి ఆయోగ్ పలు సూచనలు చేసింది. అంటే నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నీతి ఆయోగ్ కొనసాగించేందుకు సిద్ధమైంది. తాజాగా నీతి ఆయోగ్ సూచనలతో నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర మౌలిక వసతుల సంస్థ ఏపీ ఇన్ క్యాప్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది.

మోనిటైజేషన్ పైప్ లైన్ కు నోడల్ ఏజెన్సీగా ఇన్ క్యాప్ ను ఏపీ ప్రభుత్వం నియమిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో నీతి ఆయోగ్ సూచనలు చాలా కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల ద్వారా నిధుల సేకరణ వంటి అంశాలపై ఈ నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ అధ్యయనం చేయనుంది. అంటే ఏయే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేయవచ్చనే అంశంపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచలు చేసింది. అంటే ఆ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోకి వచ్చినట్టే. ఈ మోనిటైజేషన్ పైప్ లైన్ అధ్యయనం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న జాతీయ ఆస్తుల నుంచి నిధుల సమీకరణ చేసే క్రమంలో ప్రైవేటీకరణ, విలీనం సహా మూసివేత వంటి అంశాలు అందులో ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఏఏ సంస్థలను ప్రైవేటీకరించాలి, వేటిని విక్రయించాలి, వేటిని మూసివేయాలి అన్న అంశాలను ఇన్ క్యాప్ పరిశీలించి చెప్పనుంది.
Vizag steel plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఏపీ ప్రభుత్వాన్ని ఇరికించిన కేంద్రం Vizag steel plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఏపీ ప్రభుత్వాన్ని ఇరికించిన కేంద్రం Reviewed by Manam Telugu Vaaram on 11:40 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.