అన్ని తెలుగు వార్తల సమాహారం

నీలం సాహ్ని జగన్ చెప్పింది చేయడానికి వచ్చారా ?.. పరిషత్ ఎన్నికలపై జనసేన నేత సూటి ప్రశ్న

పరిషత్ ఎన్నికల పోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు దుమారం రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని, తాను బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించడం, గత ఎన్నికల నోటిఫికేషన్ కు కొనసాగింపుగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్ష పార్టీల ఆగ్రహానికి కారణంగా మారుతోంది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో పలు అక్రమాలు జరిగాయని, బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి . అంతేకాదు దీనిపై కోర్టులో కేసు సైతం విచారణలో ఉందని పేర్కొంటున్నాయి.



కోర్టులో కేసు ఉన్నా పట్టించుకోకుండా ఎన్నికలు 

నీలం సాహ్నిపై పోతిన మహేష్ ఇలాంటి సమయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఈ సి నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం జనసేన నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. తాజాగా అధికార వైసీపీపై, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పై జనసేన నాయకులు పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ, కోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా పరిషత్ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాజకీయ పార్టీలతో భేటీకి ఆహ్వానించి నోటిఫికేషన్ ఎలా ఇస్తారన్న జనసేన నేత

 ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం అప్రజాస్వామిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అరాచకాలు సృష్టించారని, బలవంతపు ఏకగ్రీవాలు చేశారని, పోటీ చేసే అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేశారని జనసేన నేత పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించి, నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు.

ఎస్ఈసిగా వచ్చారా .. లేక జగన్ చెప్పింది చేయడానికి వచ్చారా ? 

ఐదు కోట్ల ప్రజలను నీలం సాహ్ని ఏప్రిల్ ఫూల్ చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నీలం సాహ్ని ఎస్ఈసి గా వచ్చారా .. లేక జగన్ చెప్పింది చేయడానికి వచ్చారా అంటూ పోతిన మహేష్ మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల నిర్వహణను గందరగోళం చేయడం కోసం పరిషత్ ఎన్నికల నిర్వహణ జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. కొత్త ఎస్ఈసికి కోర్టులంటే గౌరవం లేదన్నారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయలేక పోయారా అని ప్రశ్నించారు.

నీలం సాహ్నిపై నిప్పులు చెరుగుతున్న జనసేన నాయకులు 

ప్రస్తుతం పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనసేన నేతలు నీలం సాహ్ని పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన భేటీని బహిష్కరించారు . బాధ్యతలు చేపట్టిన తొలి నాడే ఆమె రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఆగ్రహావేశాలను చూడాల్సి వచ్చింది. జగన్ చెప్పిన పని చెయ్యటానికే ఆమె రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారని విమర్శలు వెల్లువగా మారాయి .




నీలం సాహ్ని జగన్ చెప్పింది చేయడానికి వచ్చారా ?.. పరిషత్ ఎన్నికలపై జనసేన నేత సూటి ప్రశ్న నీలం సాహ్ని జగన్ చెప్పింది చేయడానికి వచ్చారా ?.. పరిషత్ ఎన్నికలపై జనసేన నేత సూటి ప్రశ్న Reviewed by Manam Telugu Vaaram on 3:37 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.