అన్ని తెలుగు వార్తల సమాహారం

మందుకే సగం కూలి!

 

గతం కంటే రెట్టింపైన క్వార్టర్‌ ఖర్చు
గత ప్రభుత్వంలో రోజుకు రూ.వంద.. ప్రస్తుతం రూ.200 నుంచి 250 పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం.. సర్కారీ షాపుల్లో అన్నీ డబుల్‌ రేట్లు సగటున రోజువారీ కూలి రూ.400.. క్వార్టర్‌కు మించి తాగినరోజుపస్తే అంతపెట్టలేనివారంతా నాటు వైపు.. జోరుగా ఎన్‌డీపీఎల్‌ అమ్మకాలు


బతకడానికి రోజంతా కష్టపడి పనిచేయాలి. పడిన కష్టాన్ని మర్చిపోయేందుకు సాయంత్రానికి కొంత మందు పడాలి. కానీ ఈ ప్రభుత్వంలో మందు తాగితే పేదోడికి ఇల్లు గడవటం కష్టంగా మారింది. అలాగని మందు మానేయలేని పరిస్థితి. దీంతో చేసేదేం లేదనుకుని అలాగే చాలా మంది డబుల్‌ రేట్లతోనేమందు కొని తాగుతున్నారు. అంటే మిగిలిన వారంతా మందు మానేసినట్లే కదా... ప్రభుత్వ చర్యలు అలా ఫలించినట్లే కదా... అనుకుంటే పొరపాటే. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మందు మానేసిన వారు వేరే దారులు వెతుక్కొంటున్నారు. అందులో ఒకటి ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా తెచ్చి అమ్ముతున్న నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌(ఎన్‌డీపీఎల్‌). ఇక రెండోవది నాటుసారా.


ఎన్‌డీపీఎల్‌ అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎస్‌ఈబీ అధికారుల దాడుల్లో ఎక్కడైనా నాటుసారా పట్టుబడితే ఒకేచోట వేల లీటర్ల సారా, తయారీ సరుకు పట్టుబడుతోంది. అంటే ఏ స్థాయిలో నాటుసారా వ్యాపారం రాష్ట్రంలో సాగుతోందో అర్థంచేసుకోవచ్చు. ఇందులో అధికారుల కంట పడేది కేవలం పది, ఇరవై శాతం సారాయే. మిగిలిన దాదాపు 80శాతం నాటుసారా అమ్మకాలు యథేశ్ఛగా సాగుతూనే ఉన్నాయి. ఈ రెండిటి వైపు వెళ్లలేని వారు మాత్రమే ప్రభుత్వ షాపుల్లోని మందు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం వారి నుంచే రెట్టింపు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ మొత్తం రాబట్టి ఖజనా నింపుకొంటోంది. 


మంది సగమైనా అదే అర్జన..

రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రోజుకు సగటున రూ.60 కోట్ల విలువైన మద్యం అమ్మేవారు. ఇప్పుడు కూడా కొంత అటూఇటూగా అంతే విలువైన మద్యం అమ్ముతున్నారు. అయితే విలువ అదే అయినా పరిమాణంలో మాత్రం చాలా వ్యత్యాసం వచ్చింది. ప్రభుత్వం అమాంతంగా పెంచిన ధరలే ఇందుకు కారణం. ఉదాహరణకు చూస్తే గత ప్రభుత్వంలో 2019 ఫిబ్రవరిలోని ఒక రోజున ప్రభుత్వం సరిగ్గా రూ.60 కోట్ల విలువైన మందు అమ్మింది. అందులో 1,06,205 కేసుల లిక్కర్‌, 80,416 కేసుల బీరు ఉంది. లిక్కర్‌ ఒక కేసుకు 48 క్వార్టర్‌ సీసాలు ఉంటాయి. బీర్లు కేసుకు 12 ఉంటాయి. ఆ లెక్కన చూస్తే ఆ రోజున 50, 97,840 క్వార్టర్ల లిక్కర్‌, 9,64,992 సీసాల బీరు అమ్మారు. రాష్ట్రంలో సగటున మద్యం తాగే అంచనా ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో సీసా తాగితే మొత్తం రూ.60 కోట్ల విలువైన మద్యాన్ని 60,62,832 మంది తాగారు. అంటే ఒక్కొక్కరు మందుకు ఖర్చు చేసింది 98.9 రూపాయలు.


వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిశీలిస్తే.. 2021 మార్చిలోని ఒక రోజున ఎక్సైజ్‌ శాఖ రూ.62 కోట్ల విలువైన మద్యం విక్రయించింది. అందులో 59,526 కేసుల లిక్కర్‌, 20,738 కేసుల బీరు ఉంది. కేసుకు 48 చొప్పున 28,57,248 క్వార్టర్ల లిక్కర్‌ ఉంటే... కేసుకు 12 సీసాల చొప్పున 2,48,856 బీర్లు అందులో ఉన్నాయి. సగటున ఒక్కరు ఒక సీసా తాగితే మొత్తం రూ.62 కోట్ల విలువైన మందును 31,06,104 మంది తాగారు. అంటే సగటున ఒక్కొక్కరు మందుకు ఖర్చు చేసింది 199.6 రూపాయలు. 


వీధివీధినా మొబైల్‌ బెల్టులు

వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం అంటూ చేసిన వింత సంస్కరణల వల్ల రాష్ట్రంలో బెల్టు షాపుల విచ్చలవిడిగా పెరిగిపోయాయి. గతంలో ఒక్కో గ్రామానికి ఒకటి లేదా రెండు బెల్టులు షాపులుంటే, ఇప్పుడు ఏకంగా మొబైల్‌ బెల్టులు వెలిశాయి. అయితే అవి ఒకటీ రెండుగా కాదు. ఒక్కో ఊరికి దాదాపు పది వరకూ మొబైల్‌ బెల్టులు నడుస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏదొక రూపంలో మందు తెచ్చుకుని రోజుకు ఇరవై సీసాలు అమ్ముకున్నా.. రూ.వెయ్యి సంపాదించుకోవచ్చనే కొత్త ఉపాధి మార్గం వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడింది. ఇందుకు ధరల పెరుగుదల ఒక కారణం అయితే, వైసీపీ తెచ్చిన బ్రాండ్లు నచ్చకపోవడం మరో కారణం. దీంతో చాలా మంది ఇప్పటికీ తెలంగాణ మద్యంపైనే ఆధారపడుతున్నారు. ఏపీకి, తెలంగాణకు మద్యం ధరల్లో తేడా చాలా ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులు దీన్ని ఆసరాగా చేసుకుని మొబైల్‌ బెల్టులు నడుపుతున్నారు. ఈ మార్గంలోకి యువత కూడా పెద్దఎత్తున వస్తుండటం ఆందోళనకరం.


కిక్కు కిటుకు ఇదే..

‘‘ఈ సంవత్సరం మద్యంపై వచ్చే ఆదాయం తగ్గలేదు. గత ఏడాది వచ్చినంతే ఈ ఏడాది కూడా వచ్చింది. అయితే ధరలు పెంచడం ద్వారా తాగే వారి సంఖ్యను ప్రభుత్వం తగ్గించింది. గతంలో తాగినంత మంది ఇప్పుడు తాగడం లేదు’’.. ఇది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉవాచ. ఆదాయం తగ్గలేదు...తాగేవారి సంఖ్య తగ్గింది అంటే అర్థం ఒక్కొక్కరు రెట్టింపు పన్ను కడుతున్నారనే కదా! అదెలాగో చూద్దాం.. గతంలో ఎక్కువమంది తాగే మాన్సన్‌ హౌస్‌ క్వార్టర్‌ రూ.120 ఉంటే, ఇప్పుడు అది రూ.250 అయింది. ఏసీ ప్రీమియం అప్పట్లో రూ.130 ఉంటే, ఇప్పుడు రూ.230 అయింది. ఇంపీరియల్‌ బ్లూ బ్రాండ్‌ ధర కూడా అదే స్థాయిలో ఉంది. ఎంసీ బ్రాందీ క్వార్టర్‌ అప్పట్లో రూ.120 ఉంటే, ఇప్పుడు రూ.220కి చేరింది. గత ప్రభుత్వంలో బీర్లు రూ.110గా ఉంటే, రూ.220పైనే ఉన్నాయి. వీటిలో కొన్ని బ్రాండ్లే అందుబాటులో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన బ్రాండ్లు రూ.200 నుంచి ఉన్నాయి. వినియోగదారుడు ఏ బ్రాండ్‌ తాగాలన్నా కనీసం రూ.200 పెట్టాల్సిందే.


పథకాల డబ్బూ మందుకే

ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో పేదల ఖాతాల్లో వేస్తున్న నగదు కూడా చాలావరకు మందుకే వెళ్తోంది. గతంలో కార్పొరేషన్ల నుంచి ఏదైనా ఉపాధి పొందేందుకు రాయితీలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నేరుగా నగదు వేయడం, అవీ పండగల సమయాల్లో వేస్తుండటంతో అవి ఎక్కువ శాతం మందు షాపులకే చేరుతున్నాయి. గతంలో రాయితీలు ఇచ్చినా దానికి ఏదొక యూనిట్‌ పెట్టుకోవాలనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేకపోవడంతో మందుబాబుల ఇష్టారాజ్యం అయిపోయింది. రెట్టింపైన మద్యం ధరలు అమ్మఒడి, జగనన్నతోడు, కాపునేస్తం లాంటి పథకాల డబ్బును ఆవిరి చేస్తున్నాయి.


మందుకే సగం కూలి! మందుకే సగం కూలి! Reviewed by Manam Telugu Vaaram on 11:54 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.