అన్ని తెలుగు వార్తల సమాహారం

తిరుపతి పోరు: పవన్ ఎంట్రీ ఖరారు -రత్నప్రభ కోసం ఏప్రిల్ 3న జనసేనాని పాదయాత్ర -బీజేపీలో ఫుల్ జోష్

 ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీకి దిగాలనుకుని భంగపడ్డ జనసేనాని పవన్ కల్యాణ్.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నేరుగా వెళ్లి కలిసిన తర్వాతగానీ కాస్త మెత్తబడలేదు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసినరోజే 'వకీల్ సాబ్' ట్రైలర్ విడుదల ద్వారా పవన్ సత్తాచాటుకునే ప్రయత్నం చేయడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో సీనియర్ భాగస్వామి జనసేన పార్టీనే అని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ స్పష్టం చేసిన దరిమిలా తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పవన్ ఎంట్రీ ఖరారైంది. ఆయనకు గ్రాండ్ వెల్కం పలికేందుకు బీజేపీ ఏకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది.




ఏప్రిల్ 3న పవన్ పాదయాత్ర

 తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్ తదితరులతో కలిసి హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ను కలిసిన తర్వాత కూడా ఆమెకు జనసేన మద్దతుపై అనుమానాలు వ్యక్తం కావడం, రత్నప్రభ అభ్యర్థిత్వంపై ఇప్పటికీ జనసైనికుల్లో అసంతృప్తి ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రచారం చేస్తారా? లేదా? అనే ఉత్కంఠ ఏర్పడింది. దీనికి తెరదించుతూ, బీజేపీ తరఫున జనసేనాని ఒట్టి ప్రచారమేకాదు.. ఏకంగా పాదయాత్ర కూడా చేయబోతున్నట్లు జనసేన పార్టీ మంగళవారం ప్రకటించింది. పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ కూడా రెడీ అయిందని నాదెండ్ల తెలిపారు
\
జనసేనాని ర్యాలీ రూట్ మ్యాప్.. 

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ మనోహర్ కొద్ది రోజులుగా తిరుపతిలోనే మకాం వేసి ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్.. పవన్ పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 3న పవన్ తిరుపతి ప్రచారంలో పాల్గొంటారని, బీజేపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా తిరుపతి పట్టణంలోని ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ పాదయాత్ర చేపడతారని వెల్లడించారు.

శంకంబాడి వద్ద భారీ సభ.

. ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా తిరుపతిలో పవన్ కల్యాణ్ పాదయాత్ర ఉంటుందని, ఏప్రిల్ 3న మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందని, పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ, జనసేన పార్టీలు భారీ ప్రణాళికలు సిద్దంచేశాయని, రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి జనం తరలివస్తారని పేర్కొన్నారు.

సేనాని కోసం బీజేపీ ప్లాన్..

 తిరుపతిలో ప్రచారం నిర్వహించేందుకు వస్తోన్న పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ కూడా ఎదురు చూస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందుకోసం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీ కూడా వేశారని, జనసేన అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ కూడా శాయశక్తుల కృషి చేస్తోందని చెప్పారు. పవన్ ర్యాలీ, సభ ద్వారా బీజేపీ, జనసేన పొత్తుపై నెలకొన్న అనుమానాలు, అపోహలు, అసత్యాలు పటాపంచలవుతాయని, రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే రెండు పార్టీలు కలిశాయన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళుతామని నాదెండ్ల పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మంచి నాయకుడిగా ఎదగడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా పనిచేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బలిజ నేతలపై వైసీపీ బెదిరింపులు..

 పవన్ కల్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతిలో పాదయాత్ర, సభ నిర్వహిస్తాని స్పష్టం చేసిన నాదెండ్.. స్థానికంగా అధికార వైసీపీ ఆగడాలకు పాల్పడుతోందని ఆరోపించారు. జనసేన పార్టీ సానుభూతిపరులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నట్లు పార్టీ దృష్టికి వచ్చిందని, ప్రధానంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, వ్యాపారస్థులను పిలుపించుకొని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబడితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వ్యాపారాలు చేయనివ్వబోమని భయపెడుతున్నారని నాదెండ్ల ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులకు తావు ఉండరాదని, ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్లో వైసీపీ ఇలా దౌర్జన్యాలకు దిగితే, జనమే తిరగబడతారని నాదెండ్ల హెచ్చరించారు.


తిరుపతి పోరు: పవన్ ఎంట్రీ ఖరారు -రత్నప్రభ కోసం ఏప్రిల్ 3న జనసేనాని పాదయాత్ర -బీజేపీలో ఫుల్ జోష్ తిరుపతి పోరు: పవన్ ఎంట్రీ ఖరారు -రత్నప్రభ కోసం ఏప్రిల్ 3న జనసేనాని పాదయాత్ర -బీజేపీలో ఫుల్ జోష్ Reviewed by Manam Telugu Vaaram on 11:17 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.