మగవాళ్లంతా చీరలు కడతారు. బంగారు ఆభరణాలు ధరిస్తారు. అచ్చం మహిళల్లా ముస్తాబై ఊరేగింపుగా బయలుదేరుతారు.
ఇదంతా.. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరులో హోలీ రోజున జరిగే కార్యక్రమం. దీన్ని కాముని దహనం అని స్థానికంగా పిలుస్తుంటారు.
కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ గ్రామంలో హోలీ వచ్చిందంటే చాలు మగవాళ్లు చీరలుకట్టి మగువలుగా మారిపోతారు.
గ్రామంలోని ఒక ఆలయంలో రతీ మన్మథుల విగ్రహాలు ఉన్నాయి. మహిళల్లాగా తయారైన మగవాళ్లంతా అక్కడికి వెళ్లి తమ ‘మొక్కులు’ తీర్చుకుంటారు.
గ్రామంలోని రతీమన్మథులకు భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరతాయన్నది వారి నమ్మకం. ఉద్యోగం, వివాహం, సంతానం, వ్యాపారం, వ్యవసాయంలో లాభం ఇలా రకరకాలుగా కోరికలు కోరుతుంటారు.
ఈ మొక్కు వల్లే కోరికలు తీరాయని భావించే మగవారు హోలీ పండుగరోజు చీరకట్టుకొని బంగారు ఆభరణాలు ధరిస్తారు. పూలతో అలంకరించుకుంటారు. పిండివంటలు తయారు చేస్తారు
కుటుంబ సభ్యులతో కలిసి పూల బుట్టలు, పిండివంటలతో ఆలయానికి చేరుకుంటారు.
మగవారు అక్కడ రతీమన్మథులకు స్త్రీ వేషధారణలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కోరికలు తీరిన మగవారు స్త్రీ వేషధారణలో పూజలు చేయటమనే ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది.
ప్రతియేట జరిగే ఈ వేడుకను చూసేందుకు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు
Reviewed by Manam Telugu Vaaram
on
11:01 PM
Rating:


కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know